![]() |
![]() |
బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కృతి సనన్ నటించిన ఒక కమర్షియల్ యాడ్ ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ 'జీవా' రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ ప్రకటనపై నెటిజన్ల నుంచి, సినీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. రక్షాబంధన్ పండుగ ప్రాశస్త్యాన్ని తక్కువ చేసి చూపేలా ఈ యాడ్ ఉందంటూ కామెంట్లు రావడంతో సదరు సంస్థ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
ప్రముఖ బ్రాండ్ జీవా విడుదల చేసిన దాదాపు 36 సెకన్ల ఈ వాణిజ్య ప్రకటనలో కృతి సనన్ ఇండో-వెస్ట్రన్ గ్లామరస్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. అయితే, ఆ వీడియోలో ఆమె తన సోదరుడితో పాటు ఒక పెంపుడు శునకానికి కూడా రాఖీ కడుతున్నట్లు చూపించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన రక్షాబంధన్ పండుగలో సాంప్రదాయ దుస్తులు కాకుండా బోల్డ్ దుస్తులు ధరించడం, పెంపుడు జంతువును చేర్చడం సంస్కృతిని అవమానించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు.
ఈ వివాదంపై ఫైర్‌బ్రాండ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ కూడా ఘాటుగా స్పందించారు. "సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ఇలాంటి దుస్తులు ధరిస్తారా?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాంప్రదాయ పండుగల వేళ ఇలాంటి ప్రచారాలు చేయడం సంస్కృతిని విస్మరించడమేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నెటిజన్లతో పాటు ప్రముఖుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో జీవా జ్యువెలరీ సంస్థ దిగొచ్చింది. బుధవారం ఈ వివాదంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. తమకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు పండుగల పట్ల ఎంతో గౌరవం ఉందని తెలిపింది. కేవలం అనుబంధాన్ని చాటిచెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియోను రూపొందించామని, అయితే ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరింది.
వివాదం ముదరకుండా ఉండేందుకు అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఈ రాఖీ యాడ్‌ను తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. వివాదాల సంగతి పక్కన పెడితే, కృతి సనన్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, సొంతంగా నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నారు.
Kriti Sanon Dress Controversy, Giva Jewelry Rakhi Ad Controversy, Kangana Ranaut Criticism Kriti Sanon, Bollywood News Telugu, TeluguOne Entertainment News
![]() |
![]() |